Saturday, September 29, 2012

పాము బండి ఎక్కండి

కప్పల రాజ్యంలోకి తాచుపాము వచ్చింది.
‘ఎన్నాళ్లిలా కాళ్లీడ్చుకుంటూ తిరుగుతారు? దయచేసి నన్ను వాహనంగా చేసుకోండి. ఎక్కడికి పడితే అక్కడికి యమస్పీడుగా వెళ్లండి. మీ సేవలో నన్ను తరించనివ్వండి’ అని ప్రాధేయపడింది. కప్పలరాజు ‘సరే’ అన్నాడు. కప్పలు బిలబిలా పామునెక్కి ‘బలేబలే’ అంటూ దర్జాగా విహరించసాగాయి.
కాసేపటికి పాము నీరసించి ఆగిపోయి, ‘ఇక నా వల్లకాదు. ఆకలేస్తోంది’ అంది. రాజు దయతలిచి ‘మాలో ఓ చిరుకప్పను తిను’ అని పర్మిషను ఇచ్చాడు. తిన్నాక పాము బండి మళ్లీ కదిలింది. కాసేపటికి మళ్లీ ఆగింది...
కట్ చేస్తే - రాజుతోసహా కప్పలన్నీ పాము బొజ్జలోకి వెళ్లాయి. కప్పలరాజ్యం పాము పరమైంది.
చిన్నప్పుడు చదువుకున్న పంచతంత్రం కథ ఇది. పెద్దయ్యాక మరచిపోయాం. అందుకే విదేశీ త్రాచులకు మరీమరీ అలుసవుతున్నాం.
లేటెస్టుగా ఇప్పుడు మొదలైందీ అదే కథ.
బహుళ జాతీయ తెల్లతాచుల కన్ను చాలకాలంగా మన కిరాణా కప్పల మీద పడింది. ‘వీధి వీధికీ, సందు సందుకూ ఇన్ని బుల్లి దుకాణాలెందుకు? రోడ్లమీద ఇన్ని తోపుడు బండ్ల వ్యాపారాలెందుకు? దారి పక్క తట్టలూ బుట్టల్లో చిల్లర మల్లరగా సరుకులమ్ముతూ పోతే పాపం మీ దేశం ఎప్పటికి బాగుపడుతుంది? ఉత్పత్తిదారుకూ, వినియోగదారుకూ మధ్య ఇన్నిన్ని అంచెలుంటే ధరలెలా తగ్గుతాయి? మాకు కాస్త అవకాశమివ్వండి. అమెరికా లెవెల్లో ఎక్కడికక్కడ లంకంత ‘మాల్స్’ తెరుస్తాం. తయారీదారునుంచి నేరుగా కొని, వాడకందారుకు సరసమైన ధరకు నేరుగా అమ్మి వారికీ వీరికీ లాభం చేస్తాం. లక్షల మందికి ఉద్యోగాలిస్తాం. కోట్లమందిని ఆదుకుంటాం. పెట్టుబడులకు మొగంవాచిన మీ ఆర్థికరంగంలోకి లక్షల కోట్ల రూపాయలు కుంభవృష్టి కురిపించి, మీ నేలబారు బతుకులను ఆకాశానికి లేపేసి స్వర్గం చూపిస్తాం’ అని మన ఏలినవారికి బంపర్ ఆఫర్ ఇచ్చాయి.
అన్నీ కోతలే. అంతా మోసమే. వాల్‌మార్ట్, కారెఫొర్ లాంటి సీమనాగులు ఇప్పటికే అనేక దేశాల్లో పడగవిప్పాయి. తమ నీడపడిన ప్రతిచోటా చిల్లర కప్పలను టోకున మింగి, అన్ని వర్గాలకూ సమాన అన్యాయం చేసి తెగబలిశాయి.
ఎక్కడిదాకానో ఎందుకు? ప్రపంచ పెట్టుబడి పెద్దమ్మ అయిన అమెరికాలో ఆహార పదార్థాల మీద వినియోగదారు చెల్లించే ప్రతి డాలరుపైనా పండించే రైతుకు 70 సెంట్లు 1950ల దాకా ముట్టేది. 1996 వరకూ కూడా చిల్లర ధరలో 52 శాతం రైతుకు అందేది. నడమంత్రపు కిరాణా విప్లవం వచ్చి వాల్‌మార్టుల పాలపడ్డాక అది కాస్తా ఇప్పుడు 38 శాతానికి పడిపోయింది. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లోనూ ఇంచుమించుగా అదే స్థితి. మామూలు వర్తక విధానంలో తయారీదారుకూ, వినియోగదారుకూ మధ్య ఉండే పలు అంచెల దళారులను కార్పొరేట్ కొండ చిలువలు వచ్చి మింగేసిన మాట నిజమే. కాని దానివల్ల ఆదా అయ్యే మొత్తాన్ని ఆ కొండ చిలువలే తేరగా ఆరగిస్తున్నాయ తప్ప అటు ఉత్పత్తిదారుకు గాని, ఇటు వాడకం దారుకుగాని వీసమెత్తు ఉపయోగం లేదు. అమెరికాలో ఏటా 30వేల కోట్ల డాలర్లకు పైగా ప్రభుత్వ మిచ్చే వ్యవసాయ సబ్సిడీ మీదే అక్కడి రైతుల మనుగడ ఆధారపడి ఉంది. కిరాణా వ్యాపారంలో గుత్త్ధాపత్యం చలాయిస్తున్న వాల్‌మార్టుల్లాంటి మోతుబరి సంస్థలు పంట పండించేవాడికి గిట్టుబాటు ధరనే ఇస్తున్నట్లయితే సర్కారీ సబ్సిడీకోసం అంగలార్చాల్సిన అగత్యం అమెరికన్ రైతుకు పట్టేది కాదు. వాళ్ల దేశంలోనే రైతుల నోట మట్టికొట్టే పుణ్యాత్ములు... మన దేశంలో అడుగుపెట్టనిస్తే మన రైతుల నోట్లో పంచదార పోస్తారని నమ్మాలిట!
తలుపులు బార్లా తెరిచి విదేశీ బందిపోట్లని లోపలికి రానిస్తేగానీ ఇండియా ముందుకు పోదు; మా అంతగా బాగుపడదు... అని అమెరికా దేవర ఒబామా ఈ మధ్య మన గవర్నమెంటుకు క్లాసు తీసుకుని చిటపడలాడుతున్న సమయంలోనే అక్కడ అదే అమెరికాలో పెద్ద ఆందోళన నడిచింది. ఆ దేశంలో చిన్నచిన్న దుకాణాలను తొక్కేసి కిరాణా రంగంలో పోతరించిన వాల్‌మార్టు సరిగా జీతాలు ఇవ్వకుండా ఎడాపెడా కార్మికులను దోపిడీ చేస్తున్నదని బాధితుల ఫిర్యాదు. డాలర్ పుణ్యభూమిలోనే పరిస్థితి అంత లక్షణంగా ఉంటే అదే వాల్‌మార్టు చేతికి మన కిరాణా వ్యాపారాన్ని అప్పగిస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలొస్తాయి, ఇప్పటిదాకా చిన్నకొట్లలో చాలీచాలని జీతాలతో దోపిడీకి గురవుతున్న పనివారి బతుకులు బంగారమవుతాయి అంటూ కార్పొరేట్ల బాకాలు మన చెవుల తుప్పు వదిలిస్తున్నాయి.
విదేశీ పెట్టుబడులు మనకు చేదేమీ కాదు. పి.వి.నరసింహారావు ఆర్థిక సంస్కరణల తెరచాప ఎత్తింది లగాయతు ఈ ఒకటి రెండు దశాబ్దాల్లో అనేక రంగాల్లో వేరువేరు మోతాదుల్లో విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. వాటివల్ల కనీసం కొన్ని రంగాల్లో కావలసినంత మేలు జరిగింది కూడా. రిలయెన్సు, స్పెన్సర్సు, సిటీ సెంట్రలు లాంటి మాల్సు, సూపర్, హైపర్ మార్కెట్లు ఇప్పటికే మన నగరాల్లో నడుస్తుండగా లేనిది వాటి సరసన ఇంకో విదేశీ వాల్‌మార్టు వెలిసి ఇంకా చవకగా నాణ్యమైన సర్వీసు ఇస్తానంటే ఎందుకు కాదనాలి - అన్న అభిప్రాయం మనవాళ్లు చాలా మందికి ఉంది.
మార్కెట్‌లో పోటీదార్లను తొక్కెయ్యటం కోసం మొదట్లో చిల్లర ధరలను బాగా తగ్గించినా, గుత్త్ధాపత్యం చేతికొచ్చాక ఇష్టానుసారం ధరలు పెంచి జనాన్ని నంజుకు తినటం వాల్‌మార్టాసురులకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పుడు పెద్ద నగరాల్లోని దేశవాళీ మాల్స్‌వల్ల, అదే ఊళ్ళలోని చిల్లర వ్యాపారాలకు, పట్టణ, గ్రామస్థాయిల్లో కిరాణా బిజినెసుకూ, వాటిమీద ఆధారపడ్డ కోట్లమంది బతుకుతెరువుకూ డోకాలేని మాట నిజం. కాని విదేశీ పెత్తందార్లు వచ్చాక సీను ఇలా ఉండదు. బిగ్‌బజార్‌లయినా, ‘మోర్’ మార్కెట్లయినా, మరొకటయినా ఇక్కడ తయారైనవాటిని ఇక్కడ అమ్మగల వంతే. అదే వాల్‌మార్టో, మరో బహుళజాతి భూతమో అయితే... ఆఫ్రికాలో కారుచవకగా సరుకును తయారుచేయించి ఇండియాలో అమ్మగలవు. కోకాకోలా, పెప్సీలు వచ్చి మన పండ్ల రసాల కంపెనీలను మింగేసి పనికిమాలిన రంగునీళ్లను అందరిచేతా తాగిస్తున్నట్టే... రేపు వచ్చే వాల్‌మార్టులు ఇంకా పెద్ద స్థాయిలో, ఇంకా దుర్మార్గంగా మన అభిరుచులను, ఆహారపు అలవాట్లను ఆనవాళ్లు లేకుండా మార్చెయ్యగలవు. జన్యుమార్పిడి విత్తనాలతో పత్తి రైతులను సర్వనాశనం చేసినట్టే రేపు జన్యుమార్పిడి బియ్యాలూ, జొన్నలూ, గోధుమలూ, కూరగాయలూ తెచ్చిపెట్టి, అవి మినహా మరేవీ మార్కెట్లో దొరక్కుండా చేసి, మన తిండిని శాసించగలవు. మనకు మనల్నే పరాయివాళ్లుగా మార్చెయ్యగలవు.
‘అంత పెద్ద రెడ్డి చెయ్య పట్టుకుంటే కాదనేదెట్టా’ అన్న పల్లెటూరి వగలాడిలాగా అమెరికా ప్రెసిడెంటంతటి పెద్దసారు నోరు తెరిచి మందలించాక, ఇంకా తాత్సారం చేస్తూ కూచుంటే ఎలా అని మాన్య ప్రధాని మన్‌మోహన్‌జీ కూడా అన్నిటికీ తెగించి, కప్పలరాజు మల్లే కిరాణాలో విదేశీ పెట్టుబడికి గ్రీన్ సిగ్నలు ఇచ్చేశాడు. ఎక్కి ఎంజాయ్ చెయ్యటానికి మనం రడీ! ఇక సీమత్రాచులదే ఆలస్యం.

SOURCE: ANDHRABHOOMI DAILY

No comments: