Saturday, May 5, 2012

సేకరణ వార్త : కిడ్నాపే కల్పతరువు.


తుపాకి గొట్టం నుంచి అధికారం తన్నుకొస్తుందన్నాడు మావో.
అదంతా పాత చాదస్తం. మావోను చంపి పుట్టిన మావోయిస్టుల చేతిలో విప్లవం చాలా ముందుకు పోయింది. ఇప్పుడంతా షార్ట్‌కట్టు. కిడ్నాపే విప్లవ కోర్కెలు తీర్చే కల్పతరువు!
ఎన్ని మందుపాతరలు పేల్చినా, ఎందరు పోలీసులను మాటువేసి చంపినా, ఊళ్లమీద పడి ఎందరిని నరికి పోగులు పెట్టినా రాని పేరు, ప్రఖ్యాతి ఒక ఎమ్మెల్యేనో, ఒక కలెక్టరునో ఎత్తుకుపోతే కొల్లలుగా వచ్చిపడతాయి. ఒక దళాన్ని మట్టుపెడితే ప్రభుత్వం పది దళాలను పంపిస్తుంది. ఒక స్టేషనును పేల్చేస్తే కొత్తగా పది స్టేషన్లను తెరుస్తుంది. కాని- ఒక ప్రముఖుడిని కిడ్నాప్ చేస్తే? అదే ప్రభుత్వం గజగజ వణికి చేతులెత్తేస్తుంది. తోకముడిచి, తలకాయ తీసి జేబులో దాచుకుని ముక్కు నేలకు రాయమన్నా రాస్తుంది.
మావోల ఆటపట్టయిన ఒడిషాలో నిరుడు ఒక కలెక్టరునూ, ఈ మధ్య ఒక ఎమ్మెల్యేనూ వీరవిప్లవకారులు చెరపట్టినప్పుడు ఏమైంది? ఎన్నో ఖూనీలు, దోపిడీలు చేసి లెక్కలేనన్ని కేసుల్లో ముద్దాయిలై, కర్మంచాలక పోలీసులకు చిక్కిన కామ్రేడ్లను ఎందరిని విడిచిపెట్టమంటే అందరినీ గవర్నమెంటు బయటికొదిలింది. ఏ వేటను ఆపమంటే ఆ వేటను ఆపేసింది. రంగంలోని పోలీసులను ఏ దొడ్లోకి తోలమంటే ఆ దొడ్లోకి తోలేసింది.
టెర్రరిస్టులకూ, మావోయిస్టులకూ చేసే పనుల్లో తేడా లేకపోయినా... వారూ వీరూ తీసే ప్రాణాలూ చేసే విధ్వంసాలూ ఒకే బాపతువైనా వీరినీ వారినీ ఒకే గాటన కట్టటం చాలా బోలెడు తప్పు. నక్సల్ మార్కు మావోయిజమనేది కేవలం శాంతిభద్రతల సమస్యకాదు. సామాజిక, ఆర్థిక మూలాలకు మందువేసి నయంచేస్తే తప్ప అదిపోదు - అని అతివాద విప్లవ మేధావులు అడక్కపోయినా క్లాసు తీసుకుంటారు. పత్రికలు, సర్కారీ పెద్దలు, అమాంబాపతు బుద్ధి జీవులు కూడా అవే చిలకపలుకులు పలుకుతారు. మరి అట్టడుగు స్థాయిలో జనంలోకి వెళ్లి, పేద ప్రజల బాగుకు నిజాయతీగా కృషిచేస్తున్న కలెక్టర్లను ఎత్తుకుపోయి, ప్రాణాలు తీస్తామని బెదిరించటం ఏ రకమైన విప్లవ కమ్యూనిజం అని ఒక్కరూ అడగరు. విధి నిర్వహణ చేస్తున్న చత్తిస్‌గఢ్ కలెక్టరును కాపాడే డ్యూటీలో మావోయిస్టుల విప్లవ తుపాకులకు నిలువునా బలి అయిన ఇద్దరు బాడీగార్డులు ఏమి నేరం చేశారనీ పెద్ద మనుషులెవరూ అడిగిన పాపాన పోరు. ఆఖరికి మావోల చెరనుంచి బయటపడ్డ కలెక్టరు కూడా మావోలకూ, సర్కారుకూ మధ్యవర్తులుగా ఉన్న మహామేధావులకు కృతజ్ఞత చెప్పుకుంటాడే తప్ప... తన కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరు గన్‌మెన్లను అందరిముందు తలవనైనా తలవడు.
కిడ్నాపులు, బెదిరింపులు ప్రపంచానికి కొత్త కావు. మాటవరసకు అమెరికాలోనూ పంతం నెగ్గించుకోవటం కోసం ఎన్నో అపహరణలు జరిగాయి. ఆరు నూరైనా అలాంటి బ్లాక్ మెయిలింగులకు లొంగేది లేదని అక్కడి ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. ఇప్పటికీ అదే మాటమీద నిలబడింది. పౌరులనో, ప్రముఖులనో దుండగులు బంధించిన సందర్భాల్లో కమాండోలను పంపి బందీలను బలవంతంగా విడిపించటానికే అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో ఎన్ని ప్రాణాలు పోయినా, మొత్తం ఆపరేషను వికటించినా ప్రజలు మీడియావారు, బాధితుల బంధువులు కూడా పెద్ద మనస్సుతో అర్థం చేసుకుంటారు.
అదే మన దేశంలోనో? కిడ్నాప్ అరుూ్య కాగానే మీడియా వాళ్లకు శివాలెత్తుతాయి. బందీల కుటుంబాల క్షోభను క్లోజప్‌లో చూపిందే చూపించి, ఎప్పుడు కదులుతారు, ఎప్పుడు విడిపిస్తారు అంటూ గవర్నమెంటును గంట గంటకూ గుచ్చిగుచ్చి ప్రశ్నించి, మాస్ హిస్టీరియాను పనిగట్టుకుని పెంచి, కిడ్నాపర్ల పని సులభం చేసిపెడతారు. డ్యూటీ చేస్తున్న పోలీసులను చంపి, అమాయకులను నరికి పోగులుపెట్టి, ఖూనీలు, లూటీలు, విచ్చలవిడిగా చేసిన సంఘ వ్యతిరేక శక్తుల డైరీలను, అమ్మలకు రాసుకున్న ఉత్తరాలను, నెత్తుటి సిరాతో అల్లుకున్న కవిత్వాలను పోటీలు పడి పత్రికల్లో ధారావాహికంగా వేసి అభ్యుదయ వాదులన్న నకిలీ భుజకీర్తుల కోసం అడ్డమైన పాట్లు పడతారు.
మీడియా వారు ఓవరాక్షన్లు చేసినంత మాత్రాన రాజ్యమేలే వారు గంగవెర్రులెత్తాల్సిన పనిలేదు. 1984లో ఏమైంది? కాశ్మీర్ టెర్రరిస్టులు రవీంద్ర మహాత్రే అనే భారత దౌత్యాధికారిని అపహరించారు. మఖ్‌బూల్ భటే అనే ఉగ్రవాది ఉరిని ఆపకపోతే అతడిని చంపేస్తామని బెదిరించారు. అప్పుడు గద్దెమీద ఉన్నది ఐరన్‌లేడీ ఇందిరాగాంధి. ఏమైనాసరే అని గుండె రాయ చేసుకుని ఆమె ఉరి అమలు చేయంచింది. కిడ్నాపర్లు బందీని చంపేశారు. అయినా ప్రభుత్వం తొణకలేదు.
ఇందిరమ్మకున్న దిటవు ఆమె తరవాత సింహాసనమెక్కిన వాజమ్మలకు లేదు. కేంద్రహోంమంత్రి కూతురిని కాశ్మీరీ ముష్కరులు ఎత్తుకుపోగానే వి.పి.సింగ్ సర్కారుకు కాళ్లు చల్లబడి జైల్లోని ఉగ్రవాద విషసర్పాలను విడిచిపెట్టి కాశ్మీరాన్ని అల్లకల్లోలంలోకి నెట్టింది. 1999లో హైజాక్ అయిన పౌరవిమానం అమృతసర్‌లో ముప్పావుగంటసేపు ఆగినా పట్టుకోలేని వాజపేయి దొరతనం, కందహార్‌లో తాపీగా దిగాక హైజాకర్లు ముచ్చటపడిన ప్రకారం మసూద్ అజర్‌లాంటి ముగ్గురు నరరూపరాక్షసులను జైల్లోంచి పట్టుకెళ్లి పువ్వుల్లో పెట్టి పాకిస్తానీ ఏజంట్లకు అప్పగించి సర్వానర్థాలకు తలుపులు తెరిచారు. అదే నపుంసకపు ఒరవడిని కేంద్ర, రాష్ట్రాల్లో తరవాత ప్రభుత్వాలు బహు నిష్ఠగా అనుసరిస్తున్నాయి.
కిడ్నాపర్ల డిమాండ్లకు తలవంచనే కూడదని భీష్మించటం అన్ని వేళలా కుదరదు. నిజమే. పౌరుషానికి పేరు మోసిన ఇజ్రాయెల్ కూడా ఒక్క సైనికుడి ప్రాణాన్ని దక్కించుకోవటం కోసం యావజ్జీవ శిక్షపడ్డ 280 టెర్రరిస్టులు సహా వెయ్యిమంది ఖైదీలను ఇటీవలే వదలిపెట్టాల్సి వచ్చిందన్నదీ గుర్తుంచుకోవలసిందే. విధిలేని పరిస్థితుల్లో బ్లాక్‌మెయిలింగుకు తలఒగ్గినా, అక్కర తీరగానే విజృంభించి, కిడ్నాపర్ల వెంటపడి వేటాడి, జన్మలో మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగకుండా గట్టి శాస్తి చేయటమెలాగో ఇజ్రాయెల్ లాంటి దేశాలకు తెలుసు. అది మాత్రం మనకు చేతకాదు. ఒక్క మావోయిస్టులే ఈ నాలుగేళ్లలో పదహారువందల మందిని ఎత్తుకుపోయినట్టు అధికారగణాంకాలు ఘోషిస్తున్నా, ఇలాంటి సంక్షోభం ఎదురైనప్పుడు, ఆ తరవాతా ఏమి చేయాలన్న దానిపై కచ్చితమన్న విధానమన్నది కేంద్రానే్నలే వారికీ లేదు. రాష్ట్రాలకూ లేదు. కష్టం వచ్చిన కాసేపు గంగవెర్రులు... ఆ తరవాత కుంభకర్ణుడి గురకలు! మావోయిస్టుల చేతిలోని తుపాకిని కాదు; దాని వెనక ఉన్న సామాజిక, ఆర్థిక మూలాలను చూడాలంటూ మేధావులూ, అన్ని పార్టీల నేతాశ్రీల కోరస్ పలవరింతలు; వాటికి మీడియా సర్వజ్ఞుల పక్క వాద్య సహకారాలు! కిడ్నాప్‌కూ కిడ్నాప్‌కూ మధ్య విరామమే మన దృష్టిలో శాంతి! తదుపరి బందీ ఏ రాష్ట్రంలో ఏ జిల్లా కలెక్టరు లేక ఏ పార్టీ ఎమ్మెల్యే అన్నదే వేచి చూడాల్సిందల్లా.

Copy n Paste from Andhra bhoomi News Paper

No comments: