Saturday, May 19, 2012

పత్రికల పంచాంగం


పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణమన్నాడట. తెలుగు మీడియా పెత్తందార్లూ అదే టైపు. రేపోమాపో ‘సాక్షి’కి తాళం ఖాయం అని ఎవరూ అడక్కుండానే అవి జోస్యాలు చెబుతున్నాయి. దేవుడు మేలుచేసి, వాటి వాక్కు ఫలించి అంతపనీ జరగాలేగానీ ‘ఆ రెండు పత్రికల’కు పండగే పండుగ.
గిట్టని పత్రికల మీద పాలకులు పగబట్టటం దేశానికి కొత్తకాదు. పక్కలో బల్లెంలాంటి పత్రికా సంస్థల మీద కేసులు పెట్టటం, గవర్నమెంటు అడ్వర్టయిజ్‌మెంట్లను ఆపెయ్యటం, బ్యాంకు అకౌంట్లు బిగదియ్యటం, జైల్లోకి తొయ్యటం లాంటి ఆయుధాలను ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా పత్రికల మీద చాలా ప్రభుత్వాలు ప్రయోగించాయి. అధికారం చెలాయించేవారు అలాంటి ఆగడాలకు దిగినప్పుడు విపక్షాలూ, తోటి మీడియా సంస్థలూ బాధిత పత్రికకు సంఘీభావం తెలపటం పరిపాటి.
ఇప్పుడు తెలుగునాట కన్నుల పండువ చేస్తున్న అద్భుత దృశ్యం దీనికి భిన్నం. పాలకపక్షమూ, ప్రధాన ప్రతిపక్షమూ, మీడియా మోతుబరులూ కూడబలుక్కున్నట్టు ఒకానొక పెద్ద మీడియా సంస్థను నవరంధ్రాలూ మూసి చంపెయ్యటానికి కలిసికట్టుగా తలా ఒక చెయ్యి వేస్తున్నారు. పనిలో పనిగా పత్రికా స్వేచ్ఛ అనగానేమి? అది ఎవరికి వర్తించును? ఎవరికి వర్తించదు? సమయానుకూలంగా దానికి భాష్యాలు ఎలా మారును -అన్న వాటిమీదా అమూల్య ప్రవచనాలను తెలుగు మీడియా దొరలు లోకం మీదికి వదులుతున్నారు.
సాక్షి పేపరు, ఛానెలు పాపపు సొమ్ముతో పుట్టాయట. ఆ సంగతి తెలిసే వాటిలో చేరిన ఉద్యోగులకు అవికాస్తా సర్కారీ కత్తికోతకు గురైతే తమ గతి ఏమిటని లబలబలాడే హక్కు ఉండదట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసే పత్రికాధిపతికి ప్రభుత్వం కూడా తన మీద దెబ్బకు దెబ్బ తీస్తుందన్న ఇంగితజ్ఞానం ముందే ఉండాలట. గిట్టని పత్రిక మీద కేసులు పెట్టటం, నానా విధాల వేధించటం గవర్నమెంట్ల జన్మహక్కట! తప్పుడు దారిలో పెట్టుబడులను రాబట్టినప్పుడు ఆ అభియోగంతో సంబంధం లేని మీడియా సంస్థల బ్యాంకు అకౌంట్లు ఆపేసినా, ఆస్తులు జప్తు చేసినా, యజమానులను నెట్టేసి ఏకంగా పత్రికా నిర్వహణనే సర్కారువారు తమ చేతుల్లోకి తీసుకోవాలని ఎత్తువేసినా పాపిష్టి సంస్థలో చేరిన నేరానికి జర్నలిస్టులు నోరుమూసుకుని భరించాల్సిందేనట.
ఇవి పత్రికా రంగంలో పుట్టి పెరిగిన వారికి ఇప్పటిదాకా ఊహకైనా అందని మిడిమేలపు సుద్దులు.
పత్రికా స్వేచ్ఛ అనేది పత్రిక నడిపే యజమానిదీ కాదు. అందులో పనిచేసే పాత్రికీయ సిబ్బందిదీ కాదు. నిజానికి పత్రికా స్వేచ్ఛ ఉన్నదీ, కావలసిందీ సమాజానికి; అందులోని సాధారణ ప్రజాబాహుళ్యానికి! ఎంతసేపూ ఒక పార్శ్వానే్న చూపిస్తూ రెండోవైపు యథార్థాన్ని పత్రికలు ప్రజలకంట పడనివ్వకపోతే పత్రికా స్వేచ్ఛ ఉండీ లేనట్టే.
మీడియా రాజ్యం ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి భోజ్యమై, పెద్ద పత్రికలు రెండూ ఆ వర్గానికి ఆత్మబంధువైన ఒక రాజకీయ పార్టీకి హితవరులై... ఉన్న నిష్పాక్షిక పత్రికలకేమో బలం పరిమితమైన స్థితిలో కొనే్నళ్ల కిందటిదాకా తెలుగునాట ఏకపక్ష పత్రికాస్వామ్యం రాజ్యమేలింది. పెద్దనోటి పెద్ద పత్రికలు రాసిందే వార్త, చెప్పిందే నీతిగా చలామణి అయింది. మోతుబరుల ఆధిపత్యాన్ని సవాలుచేస్తూ వారి పాఠాన్ని వారికే అప్పజెబుతూ, జగన్ అనేవాడు జబర్దస్తీగా వచ్చి సొంత పత్రిక, చానెలు పెట్టి, నాణేనికి రెండోవైపును జనం ముందు పెట్టసాగాక తెలుగు మీడియారంగం వౌలికంగా మారింది. పాఠక లోకానికి దీటైన ప్రత్యామ్నాయమనేది దొరికింది. పక్షపాత పైత్యాలూ, పరిణతి లోపించిన చాపల్యాలూ, ప్రత్యర్థులను పోలిన అవలక్షణాలూ కొత్త దుకాణంలోనూ ఎన్ని ఉంటేనేమి? పాచి నోటితో నీతిబోధలు చేసే పత్రికా పీఠాధిపతుల మట్టికాళ్లను బట్టబయలు చేయటంలో సరికొత్త పత్రిక కృతకృత్యమైంది. దాన్ని భరించలేకే ఇప్పుడు మీడియా మల్లుల శాపనార్థాలు.
వై.ఎస్. జగన్ అనేవాడు అనె్నంపునె్నం ఎరుగని అమాయకుడన్న భ్రమ ఎవరికీ లేదు. తండ్రి అధికారాన్ని ఆసరా చేసుకుని అతడు అనేక విధాల లబ్ధిపొందిన సంగతి బహిరంగ రహస్యం. ‘ఆ రెండు పత్రికలు’ ఎప్పటినుంచో పదేపదే నొక్కి వక్కాణిస్తున్నట్టు వై.ఎస్. సర్కారు నుంచి పొందిన అనుచిత, విపరీత ప్రయోజనానికి ప్రతిఫలంగానే ఆయా సంస్థలు రకరకాల మార్గాల్లో ‘సాక్షి’ మీడియాలో పెట్టుబడులు పెట్టిన మాట నిజమేనేమో! కాంగ్రెసువారూ, తెలుగుదేశంవారూ రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి చేతులు కలిపి, జగన్ మీద జాయింటుగా చేసిన పితూరీని పురస్కరించుకుని హైకోర్టు పురమాయింపుపై రంగంలోకి దిగిన సిబిఐ ఆయా నేరాలను నిరూపించగలిగితే అందరికీ సంతోషమే. చట్టబద్ధంగా నేరం రుజువయ్యాక జగన్‌నీ, అతడితో కుమ్మక్కయిన వారినీ ఉరి తీస్తామన్నా ఎవరికీ అభ్యంతరం అక్కర్లేదు. ఆ క్రమంలో అనివార్యంగా అతడి మీడియా సంస్థలు మూతపడ్డా ఎవరూ కన్నీరు కార్చాల్సిన పనిలేదు.
కాని - ఇప్పుడు జరుగుతున్నదేమిటి? టీవీల్లో డైలీ సీరియల్ లాగా అంతూ పొంతూ లేకుండా వరసగా చార్జిషీట్లు వేస్తూ, ‘ఆ రెండు పత్రికలు’ వై.ఎస్. జీవితకాలం నుంచీ వినిపిస్తున్న అభియోగాల రికార్డును తు.చ. తప్పక వన్స్‌మోర్ అనడానికి మించి, సిబిఐ కొత్తగా కనుక్కున్న కొత్త సత్యం ఒక్కటైనా ఉందా? చేంతాడంత నిందితుల జాబితాలో ఎవరిని పడితే వారిని జుట్టుపట్టి జైల్లోకి నెట్టిన మహాపత్తేదారులు నెంబర్‌వన్ నిందితుడైన జగన్‌ను అరెస్టుచేసేందుకైతే సాహసించక... అతడి మీడియా సంస్థల మీద మాత్రం వరసగా దాడులు చేయటంలోని ఆంతర్యమేమిటి? ఆ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడుల మూలాలను ఆరా తీయవలసిన సిబిఐ -ఆ అసలు పని వదిలి పత్రిక, టీవీ సంస్థల దైనందిన నిర్వహణకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఎందుకు స్తంభింప జేయాల్సి వచ్చింది? ఏదో ఒక విధంగా ఆ మీడియా సంస్థలను తమ కంట్రోల్లోకి తీసుకోవాలని, అది వీలుకాకపోతే ఏకంగా మూసివేయించాలని రాష్ట్ర ప్రభువులు ఉవ్విళ్లూరటం, అది చూసి మీడియా కరటకదమనకులు లొట్టలు వేయటం దేనికి సంకేతం? పత్రిక యజమాని మీద క్రిమినల్ కేసులో చార్జిషీటు పడిందన్న నెపంతో పత్రికా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలను బిగదియ్యబోవటం ఏమి న్యాయం? రాష్ట్రంలోని మీడియా అధిపతుల్లో ఎందరిమీద క్రిమినల్ కేసులు లేవు? ఎందరు జైలుకు పోలేదు? వారందరికీ ప్రకటనలు ఆపేశారా? బ్యాంకు ఖాతాలు బిగదీశారా? పెట్టుబడులు పాపిష్టివైతే మీడియా సంస్థలు నడవటానికే వీల్లేకపోతే... మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టిందెవరో, వెనక ఉన్నది ఎవరో అతిరహస్యమైన ‘‘ఆత్మ తృప్తి’’ పత్రికలు, చానెళ్లు ఎన్నిలేవు? వాటిమీదా ఇలాగే పడతారా?
Copy N Pasted from Andhra Bhoomi Daily

No comments: