Saturday, May 12, 2012

పెక్యులరిజం!

ప్రపంచంలోని సెక్యులర్ దేశాలకూ, మనకూ తేడా ఏమిటి?
ఇతర దేశాలు అనుసరించేది సెక్యులరిజం. మనం నిష్ఠగా పాటించేది ‘పెక్యులరిజం.’
మతాలతో నిమిత్తం లేకుండా పౌరులందరినీ సమానంగా చూసి, మెజారిటీ మతస్థులకు ఉన్నన్ని హక్కులను, అవకాశాలను మైనారిటీలకు కూడా కల్పించటం అసలైన సెక్యులరిజం. మెజారిటీ మతస్థులకు లేని ప్రత్యేక హక్కులను, అవకాశాలను మైనారిటీలకు కల్పించి (లేక కల్పించినట్టు కనిపించి) మెజారిటీ మతస్థులను అడుగడుగునా వివక్షకు గురిచేసి, రెండో తరగతి పౌరులుగా చూడటం ఇండియన్ బ్రాండు ‘పెక్యులరిజం’.
దానివల్ల స్వదేశంలోనే పరాయివాళ్లమయి పోయామన్న క్షోభ మెజారిటీ మతస్థులకు కలిగే సంగతి అలా ఉంచండి. పక్షపాతపు పాలకుల చల్లని చూపునకు నోచుకున్న మైనారిటీలకైనా కష్టాలు తీరాయా? సర్కారీ వరాలవల్ల ఇల్లంతా బంగారమై వారు మురిసి ముప్పందుమవుతున్నారా? దరిద్రమంతా పోయి సుఖభోగాల్లో మునిగితేలుతున్నారా?
అదీ లేదు. ఓటు బ్యాంకులను కొల్లగొట్టే ఆబలో అన్ని పార్టీల అన్ని ప్రభుత్వాలూ మైనారిటీల మీద ఒలికిస్తున్న మెహర్బానీ ఒక మిథ్య. దానివల్ల మైనారిటీలకు నికరంగా ఒరిగేది బహు తక్కువ.
హజ్ సబ్సిడీ ఇందుకు గొప్ప ఉదాహరణ.
వెళ్లగలిగిన అవకాశం ఉన్న వారు జీవితంలో ఒకసారి మక్కాకు హజ్‌యాత్ర చేయాలని ప్రవక్త ఆదేశం. అది ఎవరికి వారు సొంత వనరులతో చేయాల్సిందే తప్ప, ప్రభుత్వం ఎదురిచ్చి సబ్సిడీతో సాయం పట్టాల్సిన విషయం కాదు. అలా చేయటం పవిత్ర ఖురాన్ బోధకు విరుద్ధం. ఆ ఉద్దేశంతోనే ఏ ఇస్లామిక్ రాజ్యమూ హజ్ యాత్రకు ప్రభుత్వం నుంచి సబ్సిడీని ఇవ్వగలిగే స్తోమతు పుష్కలంగా ఉన్నా ఇవ్వటం లేదు. భూ ప్రపంచం మొత్తంమీద ‘సెక్యులర్’ భారత ప్రభుత్వం ఒక్కటే - అదీ ఎవరూ అడగకుండానే, ముస్లిం వర్గాల నుంచి ఏ రకమైన డిమాండూ లేకుండానే ఏటా వందలకోట్ల రూపాయలను హజ్ యాత్ర నిమిత్తం కుమ్మరిస్తున్నది.
మామూలుగా జెడ్డాకు రానూపోనూ విమానం టిక్కెట్టు దాదాపు పాతికవేల రూపాయలు ఉంటుంది. హజ్ యాత్రికులను రవాణా చేసే విమానంలో వేరేవారు ప్రయాణించకూడదని సౌదీ సర్కారు నియమం. యాత్రికులను జెడ్డాలో దింపి ఖాళీగా తిరిగొచ్చి, మళ్లీ ఖాళీగా వెళ్లి వారిని వెనక్కి తీసుకురావాలి కనుక విమానం చార్జిలు సహజంగానే రెట్టింపు అవుతాయి. హజ్ యాత్రికులు వేరే ఎయిర్‌లైన్లో వెళితే మైలపడతారని, సర్కారువారి ఎయిర్ ఇండియా మాత్రమే వారిని పవిత్రంగా తీసుకువెళ్లగలదని మన సెక్యులర్ గవర్నమెంటు వారికి పెద్ద సెంటిమెంటు! ఆ తిండిదండుగ ఎయిర్ ఇండియాయేమో తన చేతకానితనాన్ని, అసమర్థ నిర్వహణనూ పూర్తిగా ప్రదర్శిస్తూ లెక్కలు వేసి మనిషికి 58వేల రూపాయల టిక్కెటు అయితే కానీ కుదరదంటుంది. దయగల సర్కారు అందులో 12వేల రూపాయలను మాత్రమే హజ్ యాత్రికుడి నుంచి ఇప్పించి, మిగతా 46వేలూ తన ఖజానా నుంచి ఎయిరిండియాకు సబ్సిడీ కింద చెల్లిస్తున్నది. తలకు నలభై ఆరువేల చొప్పున ఏటా సుమారు లక్షన్నర మందిని హజ్ యాత్ర చేయించి తరించడం కోసం ఏటా ఆరొందల యాభై కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చిస్తున్నది. దీనికి తోడు సుహృద్భావం పేరు పెట్టి ఎం.పీ.లు, అధికార పార్టీ ప్రముఖుల వంటి విఐపిల దండును మక్కాకు యాత్రికుల వెంట తోడ పెళ్లికొడుకుల్లా ఖర్చులు భరించి పంపటానికి వదిలే చేతిచమురు దీనికి అదనం.
దేశంలో నూటికి 70 మంది మెజారిటీ మతస్థులు కాబట్టి, పన్నులు వగైరాల రూపేణా సర్కారుకు వచ్చే రాబడిలో అత్యధిక భాగం మెజారిటీ వర్గం నుంచే జమ పడుతుంది. మెజారిటీ మతానికి చెందిన ప్రజల సొమ్ముతో ఒక మైనారిటీ మతం వారి తీర్థయాత్రకు విమాన చార్జిల్లో 80 శాతాన్ని ఏలినవారు సబ్సిడీ కింద భరించటానే్న ఈ దేశంలో సెక్యులరిజమని పిలుస్తారు. మెజారిటీకి లేని భోగాన్ని ఒక మైనారిటీ వర్గానికి మాత్రమే సమకూర్చటం ఏమి న్యాయం; హిందువులు అమరనాథ్‌కో, మానస సరోవరానికో పోయి రావటానికి కూడా ఇలాగే ప్రభుత్వ సబ్సిడీ ఎందుకు ఇవ్వరు అని మెజారిటీ మతస్థుల్లో అసంతృప్తి చాలా కాలంగా ఉన్నది.
మేడిన్ ఇండియా ‘పెక్యులరిజం’ మీద చాలా మందికి ఒళ్లు మండటానికి ఇదీ ఒక కారణం. ఇనే్నళ్లలో ఎంతమంది ఎన్ని విధాల ఆక్షేపించినా ఓట్ల యావ పాలకుల చెవికి సోక లేదు. అపోజిషన్లో ఉన్నంతకాలమూ హజ్ సబ్సిడీని తిట్టిపోసిన పెద్దనీతుల భాజపేయులు కూడా గద్దె మీద కూచున్నంత కాలమూ సదరు సబ్సిడీని రూపాయి తగ్గిస్తే ఒట్టు. ఎవరేమన్నా ఎన్ని గవర్నమెంట్లు మారినా చిరంజీవిలా వర్ధిల్లిన ఈ కొరగాని సబ్సిడీని అదృష్టవశాత్తూ మొన్న సుప్రీంకోర్టు చడామడా కొట్టి పడేసింది. సంతోషం.
ఏ సౌకర్యాన్నయినా చిరకాలంగా అనుభవిస్తున్న వారికి దాన్ని కాస్తా తీసేస్తున్నారంటే మనసు చివుక్కుమనటం సహజం. ఆ లెక్కన ఏటా వందలకోట్ల రూపాయల సబ్సిడీని ఇక లాగేస్తున్నారంటే ఈపాటికి ముస్లిం వర్గాలు మహా అసంతృప్తితో భగభగలాడుతూండాలి. కాని - చిత్రం! ఇంతకాలమూ సబ్సిడీని వ్యతిరేకించిన హిందువుల్లాగే సబ్సిడీని తేరగా అనుభవించారని అనుకోబడే ముస్లిములూ అదిపోతే ‘మరీ మంచిది’ అంటున్నారు. ఈ నడమంత్రపు సబ్సిడీని ఎప్పుడో తీసేయాల్సిందని జాతీయ ముస్లిం నాయకులే అంటున్నారు.
హజ్ సబ్సిడీ రాజ్యంగ బద్ధమేనని పదేళ్ల కింద తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు దశాబ్దం లేటుగానైనా వాస్తవాన్ని గుర్తించి... మైనారిటీలకు తాయిలంగా ఉద్దేశించిన ఈ సబ్సిడీ ఇస్లాం బోధకు విరుద్ధమని, తీసేస్తే మంచిదని ఇంకేదో కేసులో న్యాయ నిర్ణయం చేయటం మంచిదే. ఎటొచ్చీ అర్థంకానిదల్లా ఒక్కటే. ముస్లింలకు కూడా పెద్దగా ఇష్టంలేనట్టు కనపడుతున్న సబ్సిడీని... కొరగానిదని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం ఇంకా ఎందుకు కొనసాగించాలి? దశలవారీగా తగ్గించి పదేళ్లకు దీన్ని మొత్తంగా ఎత్తేయాలని సుప్రీంకోర్టు చెప్పటంలోని మర్మమేమిటి? వెంటనే తొలగిస్తే తమకు చాలా కష్టం కనుక దశలవారీగా తగ్గించాలన్న అభ్యర్థన ముస్లిం వర్గాల నుంచి వచ్చి, అది సమంజసమని కోర్టు కూడా అభిప్రాయపడి, దశలవారీ ఎత్తివేతను సూచించి ఉంటే వేరే సంగతి. ప్రయోజనం పొందుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న వర్గంవారే అది తమకు అక్కర్లేదని చెబుతున్నప్పుడు పదేళ్లపాటు దానిని సాగదియ్యటం ఎందుకు? బానకడుపు ఎయిరిండియాను మరింతకాలం మేపటానికా?


Copy N Pasted From Andhrabhoomi.

No comments: